రేలంగి గ్రామానికి చెందిన తమ బాబాయి స్వర్గీయ గుండే విజయ సూర్య సుందర బాబు జీవిత కథ ఆధారంగా నిర్మించిన ప్రేమ కథా చిత్రమే “గోదారి గట్టుపైన” అని అన్నారు చిత్ర దర్శకులు సుభాష్ చంద్ర.
స్థానిక శ్రీ వెంకటేశ్వర థియేటర్ మేనెల ఎనిమిదవ తేదీన విడుదలై, రోజుకు నాలుగు ప్రదర్శనలతో దిగ్విజయంగా ప్రదర్శింపబడుతున్న “గోదారి గట్టుపైన” ప్రేమ కథా చిత్రం విజయోత్సవ వేడుక సోమవారం రాత్రి శ్రీ వెంకటేశ్వర థియేటర్ లో జరిగింది.

ఈ విజయోత్సవ వేడుకలో హీరో సుమంత్ ప్రభాస్, హీరోయిన్ నిధి ప్రదీప్, డైరెక్టర్ సుభాష్ చంద్ర, ఇతర నటీ నటులు, ఈ చిత్రంలో నటించిన తణుకు ప్రాంత నటులు వై.టి.మూర్తి, కోట రామ ప్రసాద్, ఎస్. దొర బాబు, చిత్ర డిస్ట్రిబ్యూటర్ గోళ్ళ ప్రసాద్, శ్రీ వెంకటేశ్వర థియేటర్ మేనేజర్ కానూరి రాంబాబు, ప్రేక్షక మహాశయులు, ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మిత్రులు పాల్గొన్నారు.

ఈ చిత్ర దర్శకులు సుభాష్ చంద్ర, హీరో సుమంత్ ప్రభాస్, హీరోయిన్ నిధి ప్రదీప్ ల ప్రసంగాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రమనీ, కుటుంబంలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య గల ప్రేమానురాగాలు, బంధాలు, అనుబంధాలు కళ్ళకు కట్టినట్లు చూపించారని ప్రేక్షకులు చిత్ర యూనిట్ ను కొనియాడారు.

పచ్చని పంట పొలాలతో అలరారే పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథా చిత్రం చాలా బాగుందని చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు మెచ్చుకొన్నారు.









