యంగ్ హీరో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్-ఇండియా ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘నాగబంధం’ జూలై 3, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, విజువల్స్, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఈ రోజు నుంచి అన్ని ప్రధాన భాషలు, వివిధ ఫార్మాట్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ నమోదు చేస్తుందనే ఆశాభావాన్ని చిత్ర బృందం వ్యక్తం చేస్తోంది.

ఈ చిత్రంలో జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, దక్షా నాగర్కర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ చిత్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భారీ నిర్మాణ విలువలతో రూపొందింది.
ఇక ‘నాగబంధం’ నిడివి సుమారు 3 గంటల 15 నిమిషాలుగా ఖరారైనట్లు సమాచారం. నిడివి కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, సినిమా ఫాంటసీ అడ్వెంచర్ జానర్‌కు చెందినది కావడం, కథ విస్తృతంగా ఉండటంతో అది ప్రేక్షకుల అనుభూతిపై ప్రతికూల ప్రభావం చూపకపోవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమైన ‘నాగబంధం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే జూలై 3 వరకు వేచి చూడాల్సిందే.









