“ఎవరో జ్వాలలు రగిలించారు… వేరెవరో దానికి బలి అయ్యారు” అనే భావం ఈ మధ్యకాలంలో నిజ జీవితంలోనూ ప్రతిబింబించినట్లు కనిపిస్తోంది. గత నెల విడుదలై తమిళంలో భారీ విజయాన్ని సాధిస్తూ మూడు వందల కోట్ల దిశగా దూసుకెళ్తున్న ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) ఇప్పుడు మరో కొత్త వివాదానికి తెరలేపింది.
ఇటీవల దర్శకుడు ఆర్జే బాలాజీ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను కలవడం చర్చనీయాంశంగా మారింది. అంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ కథను మొదటగా విజయ్‌కి వినిపించానని, ఆయన కెరీర్లో చివరి చిత్రంగా ఇది సరిపోతుందని భావించానని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు అప్పటివరకు పెద్దగా వివాదాస్పదం కాలేదు.
అయితే ఎడిటర్ కలైవనన్ చేసిన మరో వ్యాఖ్య పరిస్థితిని మలుపుతిప్పింది. ఒక సందర్భంలో మాట్లాడుతూ, “ఈ సినిమా విజయ్ చేసి ఉంటే మరో స్థాయిలో ఉండేది, బ్లాస్ట్ అయ్యేది” అనే రీతిలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సూర్య అభిమానుల్లో అసంతృప్తిని రేకెత్తించాయి. విజయ్ నిరాకరించడంతోనే సూర్యతో సినిమా తీసినట్టు భావన కలిగించేలా ఈ వ్యాఖ్యలు ఉండటంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ పరిస్థితిని గమనించిన సూర్య ప్రత్యక్షంగా స్పందించకపోయినా, “ప్రేమతో ఉండండి” అనే సారాంశంతో ఒక ట్వీట్ చేయడం మరో చర్చకు కారణమైంది. వివాదం పెరుగుతుందని భావించిన కలైవనన్ వెంటనే స్పందించి, తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తపడతానని వివరణ ఇచ్చారు. ఇదే ఈ వివాదానికి తాత్కాలిక ముగింపు పలికినట్లైంది.

ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ పలు సందర్భాల్లో సూర్యను తన జీవితాన్ని మార్చిన వ్యక్తిగా అభివర్ణించడం గమనార్హం. సినిమా భారీ విజయాన్ని అందుకున్న సమయంలో హీరోను ప్రశంసించడం సహజం. అయితే “ఇంకెవరైనా చేసి ఉంటే ఇంకా బాగుండేది” అనే పోలికలు చేయడం సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘వీరభద్రుడు’ చిత్రంలో సూర్య తన నటనతో పూర్తిగా న్యాయం చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో దేవుడి ఆవేశంతో చేసిన డాన్స్ ప్రతి ఒక్కరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఆ స్థాయిలో మరెవరు చేయగలరన్నది కూడా ప్రశ్నార్థకమే.
తెలుగు రాష్ట్రాల్లో సుమారు ముప్పై కోట్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం, తాజాగా విడుదలైన ‘పెద్ది’ ప్రభావంతో తన ఫైనల్ రన్‌కు చేరుకుంది.








