‘పెద్ది’ సినిమా విడుదలైన తొలి రోజే బాక్సాఫీస్ వద్ద శక్తివంతమైన ఆరంభాన్ని నమోదు చేసింది. ప్రీమియర్ షోలను కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.135 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ చిత్రం 2.5 మిలియన్ డాలర్ల మైలురాయిని దాటుతూ మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఈ సంఖ్యల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉన్నప్పటికీ, మొత్తంగా చూస్తే హీరో రామ్ చరణ్ కెరీర్లో ఇది బెస్ట్ ఓపెనింగ్స్‌గా అభిమానులు భావిస్తున్నారు.
అయితే అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది. ‘పెద్ది’కు మిక్స్డ్ టాక్ రావడం గమనార్హం. కొంతమంది ప్రేక్షకులకు సినిమా బాగా నచ్చుతుండగా, మరికొంతమంది మాత్రం సాధారణంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పబ్లిక్ టాక్ యావరేజ్ నుండి బ్లాక్‌బస్టర్ మధ్యలో ఊగిసలాడుతోంది. అయితే మౌత్ టాక్‌ను పక్కనబెట్టి ప్రేక్షకులు థియేటర్లకు వస్తే, భారీ రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇటీవల విడుదలైన కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా సగటు టాక్‌తోనే మంచి వసూళ్లు సాధించిన నేపథ్యంలో ‘పెద్ది’ భారీ కలెక్షన్లు నమోదు చేయడం ఆశ్చర్యకరం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా రూ.600 వరకు ప్రీమియర్ టికెట్ ధర ఉన్నప్పటికీ, ఫ్యాన్స్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా థియేటర్లకు రావడం ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌గా మారింది.
రెండో రోజు కూడా బుకింగ్స్ బలంగా ఉన్నాయని సమాచారం. ముఖ్యంగా బి, సి సెంటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నాయి. అయితే టికెట్ ధరల పెంపు పరిమిత కాలానికి మాత్రమే అనుమతించబడినందున, సోమవారం నుంచి కలెక్షన్లు ఎంతవరకు నిలబడతాయన్నది కీలకంగా మారింది.
‘పెద్ది’కు మరో అనుకూల అంశం లాంగ్ వీకెండ్. బుధవారం నుంచే ప్రీమియర్లు ప్రారంభం కావడంతో ఆదివారం నాటికి నాలుగు రోజుల రన్ పూర్తి అవుతుంది. ఈ కాలంలో ఆక్యుపెన్సీలు గణనీయంగా ఉండే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకోవడం సులభమవుతుంది.
అయితే దీని కోసం సినిమా టాక్ మరింత బలపడాల్సి ఉంది. మిక్స్డ్ స్పందన నుంచి యూనానిమస్ పాజిటివ్ టాక్‌కి మారితేనే దీర్ఘకాలిక విజయానికి మార్గం సుగమమవుతుంది. ఈ నమ్మకంతోనే చిత్ర యూనిట్ ముందుకు సాగుతోంది. త్వరలో సక్సెస్ మీట్ నిర్వహించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.







