‘ఓ నాన్న… నువ్వంటే’ అంటూ ఎమోషనల్ గా సాగే గీతం విని భావోద్వేగానికి లోనైన మంత్రి కందుల దుర్గేష్
సామాజిక నేపథ్యంలో చిత్రాన్ని నిర్మించిన టీమ్ కు అభినందన..ఆల్ ది బెస్ట్ చెబుతూ ఈ చిత్రం అఖండ విజయం సాధించాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్
నేటి తరానికి సామాజిక సందేశాన్నిస్తూ.. మానవతా, నైతిక విలువలు కథాంశంగా తెరకెక్కుతున్న “జయహో” చిత్రంలోని ‘ఓ నాన్న… నువ్వంటే’ అంటూ ఎమోషనల్ గా సాగే గీతాన్ని మంత్రి కందుల దుర్గేష్ గురువారం సచివాలయంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ నేతాజీ కొడియార్ ఆధ్వర్యంలో జయహో చిత్ర టీమ్ మంత్రి కందుల దుర్గేష్ ను సచివాలయంలోని ఛాంబర్ లో కలవగా ఆయన వెంటనే స్పందించి ఆ పాటను విని భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని అడిగి సినిమా వివరాలు తెలుసుకున్నారు. యువతరానికి మంచి సందేశాన్నిస్తూ నిర్మాణాత్మక విలువలతో రూపొందిస్తున్న సినిమాను ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలని కోరారు. తాను విన్న ఓ నాన్న… నువ్వంటే పాట తన మనసును హత్తుకుందన్నారు. ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియా ప్రభావం, ఫోన్ అడిక్షన్, డ్రగ్స్, మద్యం వంటి చెడు అలవాట్లతో పెడదోవ పడుతున్న నేటి యువత భవిష్యత్ కోసం, వాళ్ళ కలల సాకారం కోసం, తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని అంతర్లీనంగా చెబుతూ మంచి సందేశాత్మక చిత్రాన్ని అందించే ప్రయత్నం చేసిన నంది అవార్డు గ్రహీత, దర్శకుడు దుద్యాల కోటేంద్రను ప్రత్యేకంగా అభినందించారు.
గతంలో అనితా ఓ అనితా అంటూ విరహ గీతం తో ఫేమస్ అయి, రైల్వే ట్రాక్ అనే ఫీచర్ ఫిల్మ్ తో నంది అవార్డు అందుకున్న దర్శకుడు దుద్యాల కోటేంద్రను ప్రత్యేకంగా ప్రశంసించారు. చిత్రంలో సీనియర్ నటి ఇంద్రజ లీడ్ రోల్ లో నటిస్తున్నారని, జయ సూర్య పిక్చర్స్ బ్యానర్ పై డి.జయ పామమ్మ నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమా అఖండ విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా… తదుపరి షెడ్యూల్ ను ఈనెల చివరి వారం నుంచి మొదలు పెట్టనుందని చిత్ర యూనిట్ తెలిపారు. ఏపీలోని నంద్యాలలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో చిత్రీకరించే సినిమాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా మూవీ యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.







