“వేదవ్యాస్” మేకింగ్ వీడియో విడుదల – వరల్డ్ రికార్డ్ గుర్తింపు అందుకున్న ఎస్వీ
తెలుగు సినీ పరిశ్రమలో కుటుంబ కథా చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న 43వ చిత్రం “వేదవ్యాస్” మేకింగ్ వీడియోను విడుదల చేశారు.

ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి సమర్పణలో, సాయి ప్రగతి ఫిలిమ్స్ పతాకంపై కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంతో పిడుగు విశ్వనాథ్ హీరోగా పరిచయం అవుతున్నారు. కొరియన్ నటి జూన్ హ్యూంజీ, మంగోలియన్ నటుడు షరన్ బోల్డ్ సెగ్మెంట్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న “వేదవ్యాస్” ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా, 42 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎస్వీ కృష్ణారెడ్డి తన దర్శకత్వ ప్రయాణంలో 38 చిత్రాలకు స్వయంగా సంగీతం అందించిన అరుదైన ఘనతకు గాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నుంచి వరల్డ్ రికార్డ్ గుర్తింపును అందుకున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ, భారతీయ వేదాల గొప్పతనం, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ అంశాలను ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న “వేదవ్యాస్” చిత్రం సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తుందని తెలిపారు. సినిమా అద్భుతంగా వచ్చిందని, ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
సీనియర్ నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ, ఎస్వీ కృష్ణారెడ్డి మరిన్ని చిత్రాలతో ప్రేక్షకులను అలరించాలని ఆకాంక్షించారు. నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, దామోదర ప్రసాద్, అశోక్ కుమార్, దర్శకుడు రేలంగి నరసింహారావు తదితరులు ఎస్వీ కృష్ణారెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను కొనియాడారు.

నటి లయ, నటులు శ్రీకాంత్, జేడీ చక్రవర్తి, అలీ, శివాజీరాజా తదితరులు ఎస్వీ కృష్ణారెడ్డితో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. “వేదవ్యాస్” చిత్రం ఘన విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.
ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, తన జన్మదిన వేడుకలకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు. తన సంగీత ప్రయాణానికి వరల్డ్ రికార్డ్ గుర్తింపు లభించడం మరింత సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. “వేదవ్యాస్” చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ, దాదాపు నాలుగైదేళ్ల పాటు కృషి చేసి రూపొందించిన “వేదవ్యాస్” చిత్రం ఎస్వీ కృష్ణారెడ్డి విజన్‌కు అద్దం పడుతుందని తెలిపారు. ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు, నటీనటులు, నిర్మాత ప్రతాపరెడ్డి అందించిన సహకారం అమూల్యమని పేర్కొన్నారు.

సినీ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో ఘనంగా జరిగింది.








