సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో, విజన్ డైరెక్టర్ ఎస్. ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘వారణాసి’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తుండగా, ప్రతినాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు మంచి స్పందన దక్కించుకున్నాయి. తాజాగా ఈ సినిమాపై ప్రియాంక చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ప్రియాంక చోప్రా, తరువాత హాలీవుడ్లో పలు ప్రాజెక్ట్స్ చేస్తూ గ్లోబల్ గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం ఆమె ‘వారణాసి’లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇది ఆమెకు రెండో తెలుగు సినిమా. గతంలో తుఫాన్ అనే ద్విభాషా చిత్రంలో నటించినప్పటికీ అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దాదాపు 14 సంవత్సరాల తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు ఆమె తెలిపింది.
ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే సాహస యాత్రికుడి పాత్రలో కనిపించనుండగా, ప్రియాంక ‘మందాకినీ’ అనే పాత్రలో నటిస్తోంది. శారీతో పాటు చేతిలో తుపాకీ పట్టుకున్న ఆమె ఫస్ట్ లుక్ ఇప్పటికే ఆకట్టుకుంది. కథలో హీరోకు అండగా నిలిచే శక్తివంతమైన పాత్ర ఇది అని సమాచారం. ఈ చిత్రం తన సినీ జీవితాన్ని నిర్వచించే ప్రాజెక్ట్ అవుతుందని ప్రియాంక విశ్వాసం వ్యక్తం చేసింది.
ఇక ప్రియాంక ప్రధాన పాత్రలో నటించిన ది బ్లఫ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ చిత్రం ప్రమోషన్ల సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “భారతదేశంలో అత్యుత్తమ దర్శకుల్లో ఒకరైన రాజమౌళి సర్‌తో ‘వారణాసి’ చేస్తున్నాను. ఇది నా కెరీర్లో ఒక డిఫైనింగ్ ఫిల్మ్ అవుతుందని భావిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని తెలిపింది. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.
ఫాంటసీ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. సుమారు రూ.1300 కోట్ల భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు ప్రకటించారు.









