సినీ పరిశ్రమలో ఎంతోమంది ప్రముఖులు ఉన్నప్పటికీ, తనలాంటి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఫిల్మ్ మేకర్స్‌ను గుర్తించి, ‘జైలర్ 2’ సినిమా ఎలా ఉంది? మీ అభిప్రాయం ఏమిటి? అని అడిగి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం ప్రముఖ నటుడు ఎస్.జె. సూర్య గారి గొప్ప మనసుకు నిదర్శనమని ఫిల్మ్ మేకర్ తల్లాడ సాయి కృష్ణ అన్నారు.
ఎస్.జె. సూర్య గారితో వీడియో కాల్లో మాట్లాడిన అనంతరం తల్లాడ సాయి కృష్ణ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒక అభిమానికి తన అభిమాన నటుడితో మాట్లాడటం ఎంత సంతోషాన్నిస్తుందో, అదే సమయంలో సినీ పరిశ్రమలో ఎదుగుతున్న తమలాంటి వారిని గుర్తించి, వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
సినిమాపై అభిప్రాయాన్ని అడగడమే కాకుండా, కొత్తగా ఎదుగుతున్న ఫిల్మ్ మేకర్స్ అభిప్రాయాలను గౌరవించడం ఎస్.జె. సూర్య గారి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోందని సాయి కృష్ణ అన్నారు. ఆయన చూపించిన ఆప్యాయత, ఇచ్చిన గౌరవం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు.
ఒక గొప్ప నటుడిగా మాత్రమే కాకుండా, ఎదుగుతున్న వారిని ప్రోత్సహించే వ్యక్తిగా ఎస్.జె. సూర్య గారిపై తనకు మరింత గౌరవం పెరిగిందని తల్లాడ సాయి కృష్ణ ఆనందం వ్యక్తం చేశారు.









