దశాబ్దానికి పైగా కాలం గడిచినా అక్కినేని కుటుంబం మూడో తరం వారసుడు అఖిల్‌కు ఇప్పటికీ ఒక సాలిడ్ బ్లాక్‌బస్టర్ దక్కలేదు. వివిధ జానర్లలో సినిమాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయి విజయాలు అందకపోవడంతో అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. ముఖ్యంగా ఏజెంట్ సినిమా ఇచ్చిన షాక్ ఇంకా మిగిలే ఉంది. ఈ నేపథ్యంలో అఖిల్ తాజా చిత్రం లెనిన్ పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏమిటంటే, నాగార్జున స్వయంగా నిర్మాణ భాగస్వామిగా మారి చిత్ర నిర్మాణాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రధాన భాగస్వామిగా వ్యవహరిస్తుండటం కూడా చిత్రానికి మరింత బలం చేకూర్చుతోంది.

ఇప్పటి వరకు లెనిన్ కథాంశంపై పూర్తి క్లారిటీ రాలేదు. అఖిల్ లుక్ ఆధారంగా ఇది గ్రామీణ నేపథ్యంలోని కథ అని అర్థమవుతున్నా, సినిమాలోని అసలు ఎలిమెంట్స్‌ను మేకర్స్ గోప్యంగా ఉంచారు. అయితే తాజాగా విడుదలైన “సోల్ ఆఫ్ లెనిన్” వీడియో సాంగ్ ద్వారా కొంత క్లారిటీ వచ్చింది. ఈ పాటలో భాగ్యశ్రీ బోర్సే ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ, అఖిల్ గతంలో ఎప్పుడూ చూడని విధంగా తీవ్ర హింసాత్మకంగా కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ చిత్రానికి గుండెకాయగా నిలిచేది ప్రేమకథే. అయితే ఇది సాధారణ ప్రేమకథ కాదు — ప్రేమ ఎంత గాఢమైతే అంత తీవ్రత, హింస కూడా దానిలో భాగమవుతుందని దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు మాస్ ఎలిమెంట్స్‌తో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ భావాన్ని మరింత బలపరుస్తోంది.
ఈ సినిమాలో అఖిల్ ఒక గ్రామీణ యువకుడిగా, తన ప్రేమ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే పాత్రలో కనిపించనున్నాడు. ఈ కొత్త అవతారం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.
జూన్ 26న విడుదలకు సిద్ధమవుతున్న లెనిన్ కు బాక్సాఫీస్ వద్ద మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటికి పెద్ద సినిమాల పోటీ తక్కువగా ఉండటం, అదే సమయంలో విడుదలయ్యే ఇతర చిత్రాలు ఈ సినిమాకు సమానమైన స్థాయిలో లేకపోవడం లెనిన్‌కు ప్లస్ అవుతాయి. మంచి పాజిటివ్ టాక్ వస్తే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సులభంగా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది.
ఇక అఖిల్ కెరీర్లోనే ఎన్నడూ లేని విధంగా గ్రాండ్ ఓపెనింగ్ ఇవ్వడానికి అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.









