మాచో స్టార్ గోపీచంద్ ఈసారి గట్టి కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుసగా రొటీన్ మాస్ కథలతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు రాకపోవడంతో, ఇప్పుడు ఆయన కొత్త దారిని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. ఘాజీ అటాక్, అంతరిక్షం చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి రూపొందిస్తున్న భారీ పీరియాడిక్ డ్రామాలో గోపీచంద్ నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ‘కాలాగ్ని’ అనే శక్తివంతమైన టైటిల్ ఖరారైనట్లు సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఇదే పేరు దాదాపు ఫైనల్ అయినట్టుగా టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ముందుగా కొన్ని ఇతర టైటిల్స్ పరిశీలనలో ఉన్నప్పటికీ, చివరకు టీమ్ మొత్తం ‘కాలాగ్ని’ వైపే మొగ్గుచూపిందని చెబుతున్నారు.
ఈ సినిమాలో గోపీచంద్ ఒక యుద్ధవీరుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటివరకు ఆయన చేయని విధమైన పాత్ర కావడంతో ఇది ప్రత్యేకంగా నిలిచే అవకాశముంది. చరిత్రలో విస్మరించబడిన ఒక ఘట్టాన్ని ఆధారంగా తీసుకుని సంకల్ప్ రెడ్డి విస్తృతంగా పరిశోధించి కథను సిద్ధం చేశారట. మైథాలజీ, దేశభక్తి, చారిత్రక అంశాలను సమన్వయం చేస్తూ కథను మలిచిన తీరు కొత్త అనుభూతిని ఇస్తుందనే ప్రచారం ఉంది.
ప్రస్తుతం క్లైమాక్స్ భాగం చిత్రీకరణ జరుగుతోందని, దాదాపు పాతిక రోజులుగా సాగుతున్న ఈ ఎపిసోడ్ సినిమా హైలైట్ అవుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో సాహసోపేతంగా తెరకెక్కిస్తున్న యుద్ధ సన్నివేశాలు, ఛేజ్ సీక్వెన్సులపై దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని సమాచారం.ఈ ప్రాజెక్ట్ గోపీచంద్ కెరీర్లో కీలక మలుపు కావచ్చు. రిలీజ్ డేట్ ఇంకా నిర్ణయించలేదు. పోటీ తక్కువగా ఉండే సమయాన్ని పరిశీలిస్తూ సోలో రిలీజ్ లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వ్యక్తిగతంగానూ గోపీచంద్ ఈ చిత్రానికి విపరీతంగా శ్రమించినట్టు టాక్.
‘కాలాగ్ని’ అనే టైటిల్‌నే చూస్తే కథలో ఉన్న శక్తి అర్థమవుతోంది. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్గా రితిక నాయక్ నటిస్తోంది. ఏడవ శతాబ్దం నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రం గోపీచంద్‌కు కావాల్సిన బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.









