అఖిల్ అక్కినేని హీరోగా నటించిన రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూలై 10న విడుదల కానుంది. అయితే ఇప్పుడీ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ భాగమయ్యారు. సినిమా ఆరంభంలో నేపథ్యాన్ని, పాత్రలను పరిచయం చేయడానికి తారక్ తన పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ అందించారు. దీనికి సంబంధించిన డబ్బింగ్ ఇప్పటికే పూర్తి చేశారు. తన సినిమా కోసం గర్జించినందుకు “థ్యాంక్యూ టైగర్.. లవ్ యూ బ్రదర్” అంటూ అఖిల్ సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

అక్కినేని వారసుడు అఖిల్ సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టాలని అభిమానులతో పాటుగా టాలీవుడ్ ప్రముఖులు కూడా కోరుకుంటున్నారు. సినిమా కోసం అతడు శాయశక్తులా కష్టపడుతున్నప్పటికీ, సరైన సక్సెస్ రావడం లేదని భావిస్తున్నారు. అందుకే ఈసారి ‘లెనిన్’ సినిమాతో హిట్టు కొట్టి, బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాలని ఆశిస్తున్నారు. తమ వంతుగా సినిమాకి మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్, నాని లాంటి హీరోలు సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రానికి సపోర్ట్ అందించారు. ఇప్పుడు Junior NTR కూడా అఖిల్ కోసం రంగంలోకి దిగారు.

అఖిల్ హీరోగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ జులై 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌కు అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘లెనిన్’ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ కూడా యాడ్ అవుతోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
‘లెనిన్’ చిత్రాన్ని మనం ఎంటర్ప్రైజెస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. థమన్ సంగీతం సమకూర్చారు. లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.







