సామాజిక సేవకు ప్రాధాన్యతనిస్తూ, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కాగితం పడవలు’ చిత్ర బృందం హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ సెంటర్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కర్ణాటకకు చెందిన మెగా అభిమానులు పెద్ద ఎత్తున హాజరై రక్తదానం చేసి తమ సేవా స్పూర్తిని చాటుకున్నారు.

కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపుర జిల్లా చింతామణికి చెందిన గాయత్రమ్మ–ఆంజినప్ప దంపతులు నవనారాయణ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.జి.ఆర్. తుకారాం దర్శకత్వం వహించగా, రుద్ర సాయి సినిమాటోగ్రఫీ అందించారు. సంగీతాన్ని ఏ.ఐ.ఎస్. నోఫీల్ రాజా సమకూర్చారు.
ఈ చిత్రంలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ సోదరుడు వర్ధన్ హీరోగా నటిస్తుండగా, కేరళకు చెందిన కృష్ణ ప్రియ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రముఖ నటులు సంపత్ గాంధీ, రవి ఆనంద్ (కాకినాడ), ప్రేమ్ సాగర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ సందర్భంగా నిర్మాత ఆంజినప్ప మాట్లాడుతూ, “నేను కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC)లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. సినిమా రంగంలో ఎలాంటి అనుభవం లేకపోయినా, మంచి కథను ప్రేక్షకులకు అందించాలనే సంకల్పంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. ‘కాగితం పడవలు’ ఒక కుటుంబ కథా చిత్రంగా, ప్రేమ నేపథ్యంలో నేటి సమాజంలో కుల వ్యవస్థ కారణంగా ప్రేమికులు ఎదుర్కొనే సమస్యలను హృద్యంగా చూపించే ప్రయత్నం చేశాం. ఈ చిత్రం జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది” అని తెలిపారు.

సినిమా ప్రమోషన్‌కు సినీ పరిశ్రమలో పెద్దగా పరిచయాలు లేకపోయినా, కర్ణాటక మెగాస్టార్ అభిమానులు తమకు అండగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు శ్రీ రవణస్వామి నాయుడు అందించిన సహకారానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా రవణస్వామి నాయుడు మాట్లాడుతూ, “సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టే ప్రతి ఒక్కరికి చిరంజీవి అభిమానుల మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ‘కాగితం పడవలు’ చిత్రం ఘన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని అన్నారు.
ఈ రక్తదాన శిబిరంలో ఇప్పటికే 232 సార్లు రక్తదానం చేసిన డా. సంపత్ కుమార్, రామ్ చరణ్ సన్నిహితుడు శివ చెర్రీ, జబర్దస్త్ కళాకారుడు నవీన్, యూట్యూబ్ డ్యాన్సర్ పొట్టి మామ, సహాయ దర్శకుడు సదానంద్ తదితరులు పాల్గొని చిత్ర బృందాన్ని అభినందించారు.
సినిమా ప్రమోషన్‌తో పాటు సామాజిక సేవను కూడా సమన్వయం చేస్తూ నిర్వహించిన ఈ రక్తదాన శిబిరం అందరి ప్రశంసలు అందుకుంది.









