రాజకీయాల్లో అడుగుపెట్టడం అంత ఈజీ కాదు. ఒకసారి ప్రవేశిస్తే ఎన్నో విమర్శలు, వివాదాలు, సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొందరు ఆ ఒత్తిడిని తట్టుకుని ముందుకు సాగుతారు, మరికొందరు మధ్యలోనే వెనక్కి తగ్గిపోతారు. ఒకప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయారు. అయితే అదే మార్గంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పోరాటం కొనసాగించి చివరకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకున్నారు. పక్క రాష్ట్రం తమిళనాడులో రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్లు కూడా రాజకీయాల్లో పెద్దగా ముందుకు సాగలేక తిరిగి సినిమాల వైపు మొగ్గు చూపారు. ఎంజీఆర్ లాంటి లెజెండరీ నాయకుడి స్థానాన్ని ఇప్పటికీ ఎవరూ పూర్తిగా భర్తీ చేయలేకపోయారు.
ఇలాంటి పరిస్థితుల్లోనే తమిళ స్టార్ హీరో విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించాలని భావిస్తున్నారు. అయితే ఆ మార్గంలో ఇప్పటికే అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇటీవల జరిగిన రోడ్ షోలో అభిమానులు మరణించడం, దానిపై ఢిల్లీలో విచారణ జరగడం, భార్య సంగీతతో విడాకుల వార్తలు, త్రిషతో సంబంధాలపై వస్తున్న పుకార్లు—ఇలా పలు వివాదాలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. వీటితో పాటు సంక్రాంతి నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఆయన సినిమా ‘జన నాయకుడు’ విడుదలపై కూడా స్పష్టత లేకపోవడం అభిమానుల్లో అసహనాన్ని పెంచుతోంది.
చెన్నై ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘జన నాయకుడు’ విడుదలలో జరుగుతున్న ఆలస్యం కారణంగా అమెజాన్ ప్రైమ్‌తో కుదిరిన ఓటిటి ఒప్పందం రద్దయిందని టాక్ వినిపిస్తోంది. అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు కానీ ఈ వార్త మాత్రం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. దాదాపు 120 కోట్ల రూపాయల విలువైన ఓటిటి డీల్ ఈ ఆలస్యం వల్ల నిర్మాతకు చేజారిపోయిందని అంటున్నారు. సాధారణంగా ఓటిటి ఒప్పందాలు థియేటర్ విడుదల తేదీకి అనుగుణంగా కుదురుతాయి. విడుదల పదే పదే వాయిదా పడితే ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కు కూడా ప్లాట్‌ఫామ్‌లకు ఉంటుంది.
ఇదే తరహా సమస్య గతంలో ‘హరిహర వీరమల్లు’ సినిమాకూ ఎదురైంది. ఆ సమయంలో నిర్మాత ఏఎం రత్నం కొన్ని మార్పులతో డీల్‌ను కొనసాగించగలిగారు. చివరకు కొంత మొత్తం తగ్గించిన తర్వాతే అమెజాన్ ప్రైమ్ ఆ సినిమాను కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ‘జన నాయకుడు’ విషయంలో కూడా అలాంటి అవకాశం వస్తుందా లేదా అనేది చూడాలి.
అయితే సినిమా విడుదలై బ్లాక్‌బస్టర్ అయితే తర్వాతైనా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మాత్రం కొంత మొత్తంలో తగ్గుదల ఉండొచ్చు. అందుకే వీలైనంత త్వరగా నిర్మాణ సంస్థ కెవిఎన్ ఈ ప్రచారాలపై స్పష్టత ఇచ్చి అభిమానుల్లో ఉన్న సందేహాలను తొలగించడం మంచిదని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.









