ప్రఖ్యాత రచయిత, దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక కార్యక్రమంలో భావోద్వేగంతో క్షమాపణలు కోరడం అందరి దృష్టిని ఆకర్షించింది. మగధీర, ఈగ, బాహుబలి, భజరంగి భాయిజాన్, ఆర్ఆర్ఆర్ వంటి భారీ విజయాల చిత్రాలకు కథలు అందించి భారత సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన విజయేంద్ర ప్రసాద్ ఈసారి తన మనసులో దాచుకున్న బాధను బయటపెట్టారు.
ఒక వేడుకలో మాట్లాడుతూ, తన పూర్వీకులు చేసిన తప్పుల గురించి తాను ఎంతోకాలంగా మనసులో బాధ పడుతున్నానని చెప్పారు. చాలా రోజులుగా ఈ విషయం గురించి మాట్లాడాలని అనుకుంటున్నానని, ఇప్పుడు ఆ సమయం వచ్చినట్టుగా భావిస్తున్నానని వెల్లడించారు.
తమ కుటుంబం ఆర్థికంగా బలమైనదని పేర్కొంటూ, తనతో కలిసి చదువుకున్న జాన్ ఫ్రెడరిక్ సుందర్ రావు అనే దళిత యువకుడిని గుర్తు చేసుకున్నారు. చదువులో ప్రతిభావంతుడైన అతనికి తన తండ్రి ఆర్థిక సహాయం చేసిన విషయాన్ని వివరించారు.
అయితే, తన తాతలు, ముత్తాతలు వర్ణవివక్ష కారణంగా ఎన్నో అన్యాయాలు చేశారని ఆయన స్పష్టం చేశారు. వారి కాలంలో జరిగిన కొన్ని ఘటనలు చెప్పలేనంత బాధాకరమని, వాటి గురించి తాను పశ్చాత్తాపంతో ఉన్నానని పేర్కొన్నారు.
ఆ తప్పుల నుంచి తాను దూరంగా ఉండాలని కాకుండా, వాటి బాధ్యతను స్వీకరించాలనుకుంటున్నానని చెప్పారు. ఎందుకంటే పూర్వీకుల ఆస్తులను తాను, తన కుటుంబం అనుభవించినందున ఆ పాపాల పట్ల కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ సందర్భంగా తలవంచి పలుమార్లు క్షమాపణలు తెలుపుతూ భావోద్వేగానికి లోనయ్యారు. గద్గద స్వరంతో మాట్లాడుతుండగా కళ్లలో నీళ్లు ఉబికి రావడం చూసి సభికులు కూడా మౌనంగా విన్నారు. విజయేంద్ర ప్రసాద్ నుంచి ఊహించని ఈ స్పందన అందరినీ కదిలించగా, ఆయన వినయానికి సభికులు చప్పట్లతో అభినందనలు తెలిపారు.









