ప్రశ్న: మీరు తెలుగు సినీ పరిశ్రమలోకి ఎలా వచ్చారు?
శ్రీ కోటి: నా సంగీత ప్రయాణం ‘పంచమి’ అనే చిత్రంతో ప్రారంభమైంది. ఆ సినిమా ద్వారా నేను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటివరకు 16 సినిమాలకు సంగీతం అందించాను. ప్రస్తుతం మరో కొత్త చిత్రానికి సంగీతం సమకూరుస్తూ బిజీగా ఉన్నాను.
ప్రశ్న: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి గారితో మీ అనుబంధం గురించి చెప్పండి.
శ్రీ కోటి: ప్రముఖ సంగీత దర్శకులు స్వర్గీయులు శ్రీ చక్రి గారు, తన సంగీత సారథ్యంలో తెరకెక్కిన ‘లక్ష్మీదేవి సమర్పించు నేనే చూడండి’ చిత్రంలో ఒక పాట పాడి తనను ప్రోత్సహించారని, ఆ ప్రోత్సాహం జీవితాంతం మరువలేనిదని శ్రీ కోటి తెలిపారు. చక్రి గారితో కలిసి పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, వారికి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు.
ప్రశ్న: కరోనా సమయంలో మీరు చేసిన కరోనా అవేర్నెస్ రాప్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. దాని గురించి చెప్పండి.
శ్రీ కోటి: కరోనా మహమ్మారి సమయంలో నేను రూపొందించిన కరోనా అవేర్నెస్ రాప్ సాంగ్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకున్నారు. అంతేకాకుండా ఆయన తన ట్విట్టర్లో షేర్ చేసి నన్ను అభినందించారు. అది నాకు చాలా గర్వకారణంగా అనిపించింది. ఆ ప్రశంసలతో నా మీద మరింత బాధ్యత పెరిగిందని అనిపించింది.
ప్రశ్న: ప్రజా యుద్ధనౌక గద్దర్ గారితో పనిచేసిన అనుభవం ఎలా ఉంది?
శ్రీ కోటి: గద్దర్ అన్నతో కలిసి పని చేయడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. నా సంగీత సారథ్యంలో రూపొందిన ‘ఉక్కు సత్యాగ్రహం’ చిత్రానికి గద్దర్ అన్న రెండు పాటలు రాశారు, పాడారు, నటించారు కూడా. అలాంటి మహానుభావుడితో కలిసి పని చేయడం నా జీవితంలో ఒక మధురానుభూతి.
ప్రశ్న: మీరు ప్రైవేట్ పాటలు కూడా చాలా చేసారని వినిపిస్తోంది.
శ్రీ కోటి: అవును. ఇప్పటివరకు సుమారు 200కు పైగా ప్రైవేట్ పాటలకు సంగీతం అందించాను. సినిమాల పాటలతో పాటు ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా కూడా శ్రోతల మన్ననలు పొందడం నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది.
ప్రశ్న: చిన్న చిత్రాల నిర్మాతల గురించి మీ అభిప్రాయం ఏమిటి?
శ్రీ కోటి: చిన్న చిత్రాల నిర్మాతలకు నేను ఎప్పుడూ అండగా నిలుస్తాను. వారి బడ్జెట్ పరిమితుల్లోనే ఉత్తమమైన సంగీతాన్ని అందిస్తూ మంచి అవుట్‌పుట్ ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. మంచి కథ ఉంటే చిన్న సినిమా అయినా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని నేను నమ్ముతాను.










