యంగ్ హీరో శ్రీరామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం “మా రాముడు అందరివాడు”. ఈ చిత్రాన్ని అనుముల ప్రొడక్షన్స్ మరియు శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మాతలు అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు యద్దనపూడి మైఖేల్ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ‘ఇడిసెల్లిపోయావా..’ అనే భావోద్వేగభరితమైన పాటను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా ఘనంగా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ పాటకు దర్శకుడు యద్దనపూడి మైఖేల్ సాహిత్యం అందించగా, నల్లగొండ గద్దర్‌గా ప్రసిద్ధి చెందిన నర్సారెడ్డితో కలిసి స్వయంగా ఆలపించారు. ‘ఇడిసెల్లిపోయావా..’ పాట సినిమాలో తండ్రిని కోల్పోయిన ఒక కొడుకు బాధను, అలాగే గ్రామ ప్రజలు ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిన విషాదాన్ని ప్రతిబింబించే భావోద్వేగ గీతంగా రూపొందింది.
సాంగ్ లాంఛ్ కార్యక్రమంలో హీరో శ్రీరామ్, నిర్మాత మరియు నటుడు అనుముల లక్ష్మణరావు, దర్శకుడు యద్దనపూడి మైఖేల్, సింగర్ నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ, “మా రాముడు అందరివాడు” సినిమా నుంచి ‘ఇడిసెల్లిపోయావా..’ పాటను విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు మైఖేల్ మంచి సాహిత్యంతో ఈ పాటను రాశారని, నర్సారెడ్డి అద్భుతంగా ఆలపించారని ప్రశంసించారు. సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా ఈ సినిమాను తెరకెక్కించారని పేర్కొన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలని, కొత్త ప్రతిభను ప్రోత్సహించాలని ఆయన కోరారు.
తమ సినిమా పాటను విడుదల చేసి ప్రోత్సహించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు హీరో శ్రీరామ్, నిర్మాత అనుముల లక్ష్మణరావు, దర్శకుడు యద్దనపూడి మైఖేల్ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే “మా రాముడు అందరివాడు” చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
ఈ సినిమాలో హీరోయిన్గా స్వాతి నటిస్తుండగా, సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్, ఆనంద్ భారతి, జబర్దస్త్ అప్పారావు, చిట్టిబాబు, గడ్డం నవీన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.









