రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ త్వరలో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ వంటి చిత్రాలను అందించిన మేకర్స్ నుంచి వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్‌పై కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ట్రైలర్ విడుదల చేసి అంచనాలను మరింత పెంచారు.
పోలీస్ దర్యాప్తు చుట్టూ తిరిగే కథ
ట్రైలర్ ‘అమ్మికి ఏమైందో అని భయంగా ఉంది రమేష్’ అనే భావోద్వేగ డైలాగ్‌తో ప్రారంభమవుతుంది. తండ్రి–కూతురు మధ్య ఉన్న అనుబంధాన్ని హృద్యంగా చూపించారు. ‘నాకు జాబ్ వచ్చిందని తెలుసా?’… ‘మొదటి జీతం నాన్న చేతిలో పెట్టాలి’ వంటి డైలాగ్స్‌తో వారి బంధాన్ని హైలైట్ చేశారు.అయితే కథ మలుపు తిరిగేది కూతురు అదృశ్యమయ్యాకే. ఆమె గల్లంతు కావడంతో కేసు పోలీసుల చేతికి వెళ్తుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రెబెకా జోసెఫ్ పాత్రలో ఉదయభాను చెప్పే ‘కళ్ల ముందే ఏదో ఉంది… కానీ నేను ఏదో మిస్ అవుతున్నాను’ అనే డైలాగ్ సినిమా లో ఎన్నో ట్విస్టులు దాగి ఉన్నాయనే సంకేతం ఇస్తుంది. ట్రైలర్ మొత్తం సస్పెన్స్, థ్రిల్‌తో నిండిపోయింది.
స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
స్వాతి ఎందుకు మిస్సైంది? ఆమె హాస్టల్ స్నేహితుల పాత్ర ఏమిటి? ఉద్యోగ స్థలంలో ఏమైనా సమస్యలున్నాయా? లేక తండ్రి గతంలో ఏదైనా రహస్యమా? ఇలా అనేక ప్రశ్నలను ప్రేక్షకుల ముందుంచుతూ ట్రైలర్ ముగుస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 27 వరకు వేచి చూడాల్సిందే. ఈ చిత్రం జీ5 ఓటీటీలో అందుబాటులోకి రానుంది.ఈ సినిమాకు మైదాల శ్రుతి సంభాషణలు రాయగా, శ్రీరామ్ మద్దూరి నేపథ్య సంగీతం అందించారు. చంద్రశేఖర్ జి.వి. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించగా, రామ్ కె. మహేష్ సినిమాటోగ్రఫీ చేపట్టారు. త్వరలో మరిన్ని ప్రమోషనల్ అప్డేట్స్తో చిత్రబృందం ప్రేక్షకులను అలరించనుంది.









