సంక్రాంతి సీజన్ రాగానే ఊహించినట్టే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లపై భారీ ఒత్తిడి పడింది. సినిమాల కంటే ప్రేక్షకులే ఎక్కువగా ఉన్నట్టుగా పరిస్థితి మారింది. షోలు పెంచినా డిమాండ్ తగ్గడం లేదు. ఈ హడావుడిలో డిస్ట్రిబ్యూటర్లు సమతుల్యం పట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శంకరవరప్రసాద్ గారి సినిమాకు అంచనాలకు మించి బ్లాక్బస్టర్ స్పందన రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు.ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం కేటాయించిన హాళ్లు ఇప్పుడు సరిపోవడం లేదు. ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్దిసేపటికే హౌస్ఫుల్ బోర్డులు పడిపోతున్నాయి. కౌంటర్ అమ్మకాలు కూడా జోరుగా సాగుతుండటంతో రెండు మూడు రోజుల అడ్వాన్స్ టికెట్లు ముందుగానే అయిపోతున్నాయి. అయితే అదనపు స్క్రీన్లు ఇవ్వడానికి వీలు లేకపోవడం వల్ల కలెక్షన్ల సామర్థ్యం పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారు.‘రాజా సాబ్’ ఫలితం స్పష్టమైనా, ఆ సినిమా కోసం చేసిన భారీ డీల్స్ మరియు బ్రేక్ ఈవెన్ లక్ష్యాలు వెంటనే షోల్ని తగ్గించే అవకాశం ఇవ్వడం లేదు. కనీసం రెండో వారం వచ్చే వరకు పెద్ద మార్పులు ఉండవని బయ్యర్లు భావిస్తున్నారు.‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’కి పూర్తి స్థాయి పాజిటివ్ టాక్ రాకపోయినా, రవితేజ గత చిత్రాల కంటే మెరుగ్గా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో ప్రేక్షకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే గత పరాజయాల ప్రభావం మాస్ మహారాజాపై ఇంకా కనిపిస్తూనే ఉంది. తాజాగా వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ పరిస్థితి ఇంకా క్లారిటీకి రాలేదు. అసలు గేమ్ ఇప్పుడే మొదలవుతోంది.ఈ సాయంత్రం నుంచి ‘నారి నారి నడుమ మురారి’ ప్రదర్శనలు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ స్పందన ఆశాజనకంగా ఉంది. మంచి టాక్ వస్తే శర్వానంద్ కూడా పోటీలో గట్టిగా నిలబడే అవకాశం ఉంది. ఆదివారం వరకు పాఠశాలలకు సెలవులు ఉండటంతో స్వగ్రామాలకు వచ్చిన కుటుంబాలు థియేటర్లనే ప్రధాన వినోదంగా ఎంచుకునే అవకాశం ఉంది.ఉత్తరాంధ్ర, నైజాం ప్రాంతాల్లో ప్రేక్షకుల రద్దీ గణనీయంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ సినిమాకు ఎంత థియేటర్లు కేటాయించాలో అర్థంకాక డిస్ట్రిబ్యూటర్లు గందరగోళంలో ఉన్నారు. పోటీ కారణంగా వారి మధ్య అంతర్గత విభేదాలు కూడా తలెత్తుతున్నాయి. ఫస్ట్ ప్లేస్ దాదాపు ఫిక్స్ అయినట్టే. ఇక మిగిలిన స్థానాల కోసం అసలైన పోరు మొదలుకానుంది.








